న్యూఢిల్లీ: ఏఐ సమిట్ వేదికగా చోటుచేసుకున్న 'రోబో డాగ్' వివాదం రాజకీయ రంగు పులుముకుంది. యూపీలోని నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ చైనా రోబోను తమ సొంత ఆవిష్కరణగా ప్రదర్శించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమిట్ ‘సరైన ప్లానింగ్ లేకుండా అస్తవ్యస్తంగా నిర్వహించిన పీఆర్ స్టంట్’ అని ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
"భారతీయ ప్రతిభను, డేటాను వినియోగించుకోవాల్సింది పోయి.. ఈ ఏఐ సమిట్‌ను ఒక అస్తవ్యస్తమైన ప్రచార వేదికగా మార్చారు. భారత్ డేటాను అమ్మకానికి పెట్టడమే కాకుండా, చైనా ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు" అని రాహుల్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై దేశాన్ని నవ్వులపాలు చేసిందని విమర్శించింది.
చైనా రోబోలను భారతీయ ఆవిష్కరణలుగా చూపడం వల్ల చైనా మీడియా భారత్‌ను ఎగతాళి చేస్తోందని ఆరోపించింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రోబోకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ భారతీయ ఇంజనీర్ల ప్రతిభను కొనియాడారని కాంగ్రెస్ తప్పుపట్టింది. కేంద్ర మంత్రే ఈ అసత్య ప్రచారంలో భాగమవ్వడం సిగ్గుచేటని పేర్కొంది.
